శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (10:01 IST)

ఈ బక్కోణ్ణి కొట్టడానికి గింతమందా.. చంద్రబాబు ఓ దుష్మన్

ఈ బక్కపలచని కేసీఆర్‌ను కొట్టడానికి గింతమందా? తెలంగాణ పాలిట చంద్రబాబు ఓ దుష్మన్ అంటూ తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు రెచ్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా, చంద్రబాబుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలపై దుమ్మెత్తిపోశారు. 
 
తెలంగాణ ప్రజల పాలిట చంద్రబాబు దుష్మన్ అన్నారు. మన ప్రయోజనాలను అడ్డుకునే ఆంధ్రబాబు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబును చేయితో కొట్టొద్దని, ఓటుతో కొట్టి ఇదిరా.. తెలంగాణ అని రుజువుచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
అంతేనా, బక్కపలచని కేసీఆర్‌ను కొట్టడానికి గింతమందా? నరేంద్రమోదీ, అమిత్‌షా.. వాడెవ్వడో మన్నుషా, మట్టిషా, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఆంధ్ర నుంచి చంద్రబాబు, సీపీఐ, సీపీఎం.. వాళ్ల దుంపతెగ! రాకాసులు బయలుదేరినట్టే బయలుదేరిండ్రు! అని ఎద్దేవాచేశారు.
 
ఇంతకాలం దేశంమీద కాంగ్రెస్, బీజేపీ ఫ్యూడల్ పెత్తనం చేశాయన్న సీఎం.. తాను ఫెడరల్ ఫ్రంట్ రావాలని, కాంగ్రెస్, బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం రావాలని చెప్తుండటంతో వారు గజ్జున వణికి చస్తున్నారని చురకలు చేశారు. 
 
తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డంపడుతున్న చంద్రబాబుతో దుర్మార్గంగా పొత్తుపెట్టుకున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ దద్దమ్మ అని విమర్శించారు. మనం తాగునీళ్లు తీసుకున్నా కేసు.. వ్యవసాయానికి నీళ్లు తీసుకున్నా కేసే.. మనకు వచ్చే కరంటు ఎగబెడుతడు. మన ఏడు మండలాలను గుంజుకుపోయిండు. సీలేరు పవర్‌ప్లాంట్‌ను గుంజుకుపోయిండు అంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.