రాహుల్ దమ్ముంటే రా.... సవాల్ విసిరిన కేసీఆర్..
ఎన్నికల తేదీ దగ్గరవుతోన్నకొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొత్తగూడెంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. ప్రజా ఎజెండా వైపు అడుగులు వేయండి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఓ వైపు, టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. ప్రధాని కూడా వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు.
మాకు కావాల్సిన ప్రాజెక్టులను మేం కట్టుకుంటున్నాం. చంద్రబాబు మనకి టోపీ పెట్టాడు. మళ్లీ నమ్మితే మరోసారి టోపీ పెడతాడు అంటూ విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత తనదే అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు పధకం ఉందా అని ప్రశ్నించారు. తండాలను పంచాయితీలుగా మార్చమని… కంటికి చికిత్సలను ఏ ప్రభుత్వం అయినా చేసిందా..? అని ప్రశ్నించారు. ఏడాదిలో పాత ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామన్నారు. కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేసామని రాహుల్ అంటున్నారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే రుద్రమ్మకోటకు రావాలని, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దామని సవాల్ విసిరారు.
రైతుల కోసమే ప్రాజెక్టులను రీ-డిజైన్ చేసాం. కుంభకోణాలు లేకుండా పరిపాలన చేస్తున్నాం. ఈ విమర్శలు ఆపాలనే అసెంబ్లీ రద్దు చేసి మీ ముందుకు వచ్చాం. బయ్యారం ఉక్కు సింగరేణికే ఇద్దామని అనుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు.