మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (16:26 IST)

మిస్టర్ సీఎం కేసీఆర్.. నేను దేనికి అడ్డుపడ్డానో చెప్పు : భాగ్యనగరి నడిబొడ్డున చంద్రబాబు నిలదీత

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె. చంద్రశేఖర్ రావును ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భాగ్యనగరి నడిబొడ్డున నిలదీశారు. ప్రతి పనికీ చంద్రబాబు అడ్డుపడ్డాడంటూ కేసీఆర్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయడాన్ని చంద్రబాబు తిప్పికొట్టారు. 
 
అందుకే ఆయన హైదరాబాద్ నగర నడిబొడ్డున కేసీఆర్‌ను నిలదీశారు. తాను ఏ పనికి అడ్డుపడ్డానో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానంటే నేను అడ్డుపడ్డానా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానంటే నేను అడ్డుపడ్డానా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే అడ్డుపడ్డానా? పేదలను ఆదుకునేందుకు నేను అడ్డుపడ్డానా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నేను అడ్డుపడ్డానా? ఫామ్ హౌస్ నుంచి సచివాలయానికి కేసీఆర్ రాకుండా అడ్డుపడ్డానా? ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుపడ్డానా? అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈనెల 7వ తేదీన జరుగనుంది. ఇందుకోసం చంద్రబాబు తన రెండో విడత ఎన్నికల ప్రచారాన్నిశనివారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి తదితర అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్‌షోలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున బాబు ప్రచారం చేశారు. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపంచారు.