గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:11 IST)

నా భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారు.. ఊరుకునే ప్రసక్తే లేదు.. గీత

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుపై సతీమణి గీత మండిపడ్డారు. సోమవారం అర్థరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయాన్ని వెంటనే చెప్పాలని గీత డిమాండ్ చేశారు.


తన భర్త ఎక్కడున్నారో ప్రస్తుతం తెలియట్లేదని.. తన భర్త, మరిదితో పాటు 20మంది ముఖ్య అనుచరులను, మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తన భర్తకు ప్రాణహాని వుందని.. ఆయన ఎక్కడ వుంచారో చెప్పాలన్నారు. 
 
తన భర్తను అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించడం ప్రజాస్వామ్యమా అంటూ గీత ఫైర్ అయ్యారు. తన భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారని గీత ఆరోపించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గీతకు ఫోన్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్, తదనంతర పరిణమాలపై చర్చించారు. ధైర్యంగా వుండాలని.. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అండగా వుంటుందని హామీ ఇచ్చారు. 
 
మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ నేత డీకే అరుణ స్పందించారు. టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అప్రజాస్వామికంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారని.. కొడంగల్‌లో దారుణాలు చోటుచేసుకున్నా.. ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందన్నారు. ఇలాంటి నియంత పోకడలను తెలంగాణ ప్రజలు హర్షించదని తెలిపారు. ఈ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని డీకే అరుణ ఫైర్ అయ్యారు.