శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:27 IST)

ఆంధ్రా ఆక్టోపస్ జోస్యం తారుమారు.. కేటీఆర్ చిలక జోస్యం వ్యాఖ్యలు నిజమైనట్టేనా?

తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్, మాజీ మంత్రి లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. జాతీయ సర్వేలు టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్తే.. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా వుంది.


ప్రజా కూటమి మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని లగడపాటి స్పష్టం చేశారు. ఇక తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. తెలంగాణలోని 31 జిల్లాల్లో 44 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూముల వద్ద అనుక్షణం సీసీటీవీ కెమెరాల నిఘా, సాయుధ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే చిలక జోస్యమని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముందే తేల్చేశారు. తెలంగాణలో తమ పార్టీదే గెలుపు అని, తిరిగి టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
ఈ వ్యాఖ్యలకు అనుగుణంగానే లగడపాటి జోస్యం తారుమారైంది. స్వతంత్ర్య అభ్యర్థులు గెలుస్తారని చెప్పిన లగడపాటి నెగ్గినా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 89 స్థానాలు, కాంగ్రెస్ 16, బీజేపీ నాలుగు స్థానాలు, ఎంఐఎం ఐదు స్థానాలు, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో వున్నారు. 
 
జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 1 స్థానం, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1, టీడీపీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని చెప్పాలి.