శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (10:26 IST)

సోషల్ మీడియాపై ఈసీ డేగకన్ను... గ్రూపు సందేశాలపై నిషేధం

తెలంగాణ రాష్ట్రల ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియడంతో ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు సోషల్ మీడియాపై దృష్టిసారించారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలలో అభ్యంతరకర చిత్రాలు పంపుతూ భావోద్వేగాలను రెచ్చగొట్టే దృశ్యాలపై పోలీస్ ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. 
 
నిజానికి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదు. కానీ సోషల్ మీడియా ప్రచారంపై ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలతో సహా వారి మద్దతుదారులు కూడా అందరూ పోలింగ్ ముగిసే వరకు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై ఆధాపడ్డారు. 
 
సామాజిక మాధ్యమాల్లో నాయకులను, పార్టీలను కించపరుస్తూ అభ్యంతరకర దృశ్యాలను వీడియోలు, లేదా ఫోటోలు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దృశ్యాలపై నాయకులు, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ఐటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోషల్ మీడియాల్లో వచ్చే అభ్యంతరకత పోస్టులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం గమనార్హం.