బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By వరుణ్
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (12:40 IST)

#TelanganaElections2023 : గన్‌మెన్లతో వచ్చి ఓటేసిన బర్రెలక్క

barrelakka
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఆమె ఓటు వేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు ఎన్నికల సంఘం సెక్యూరిటీ కల్పించిన విషయం తెల్సిందే. ఓటు వేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కర్నె శిరీష  పిలుపునిచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో ఆమె నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు వీలుగా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో బెదిరింపులు వచ్చాయి. ఆమె తమ్ముడిపై కూడా దాడి జరిగింది. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ ఇతర పార్టీల అభ్యర్థులు బెదిరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో గన్‌మెన్లతో సెక్యూరిటీని కల్పించారు. కాగా, ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 
 
కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణారావు, బీజేపీ తరపున ఎల్లేని సుధాకర్ రావులు బరిలో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వరుస కడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగర వాసులు తమ సొంతూర్ళకు భారీగా తరలి వెళ్లారు. అలాగే, తెలంగాణాలో ఓటు హక్కును కలిగివున్న ఓటర్లు ఏపీ నుంచి తెలంగాణకు వస్తుండటంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది.