మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

త్వరలోనే పట్టాలెక్కనున్న మరో పది వందే భారత్ రైళ్లు

vandebharat express
దేశ వ్యాప్తంగా మరో పది వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇందులో ఒకటి సికింద్రాబాద్ నుంచి పూణె మార్గంలో నడుపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల సంఖ్య అత్యంత అధికంగా కలిగిన మార్గాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ళు ప్రయాణికుల నుంచి ఆదరణ అంతకంతకూ పెరుగుతుంది. దీంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వాటి సంఖ్యను క్రమంగా పెంచుతున్నాయి. ఈ విస్తరణలో చర్యల్లో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే ద్వారా సికింద్రాబాద్ - పూణే మధ్య వందే భారత్ సేవను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కాగా, సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే మూడు మార్గాల్లో వందే భారత్ రైళ్లను నడుపుతున్న విషయం తెల్సిందే. 
 
వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రయాణికులకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 33 రైళ్లు దేశ వ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. ఇవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాలు మరియు రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఇప్పటివరకు ఏ ఇతర రైళ్లలోనూ లేని కొన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల వాటి ఆక్యుపెన్సీ రేషియో చాలా ఎక్కువగా ఉంది. ఈ రైళ్లకు విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సేవలను జోడించాలని నిర్ణయించింది.
 
దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభించనున్న 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి సికింద్రాబాద్ - పూణే మార్గంలో ప్రవేశపెట్టబడుతుంది, ఇది అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. సికింద్రాబాద్ -పూణేతో పాటు, వారణాసి - లక్నో, పాట్నా - జల్పాయిగురి, మడ్గావ్ - మంగళూరు, ఢిల్లీ - అమృతసర్, ఇండోర్ - సూరత్, ముంబై - కొల్హాపూర్, ముంబై - జల్నా, పూణే - వడోదర, టాటానగర్ - వారణాసి సెక్షన్ల మధ్య ఈ కొత్త వందే భారత్ రైళ్లు నడుపనున్నారు.