సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మార్చి 2024 (13:48 IST)

తెలంగాణాలో 18 నుంచి పదో తరగతి పరీక్షలు - విద్యాశాఖ కీలక నిర్ణయం

students
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షల నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే లోనికి అనుమతించబోమన్న నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ ఖచ్చితంగా రాయాలన్న నిబంధన విధించింది.
 
కాపీయింగ్, మాస్ కాపీయింగ్ పాల్పడితే డీబార్ తప్పదని హెచ్చరించింది. కాపీయింగ్ విషయంలో సిబ్బంది పాత్ర ఉన్నా చర్యలు తప్పవని కరాఖండిగా తేల్చి చెప్పింది. ప్రశ్నపత్రం చేతికి ఇవ్వగానే విద్యార్థులు తొలుత ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై హాల్ టిక్కెట్ నంబర్ విధిగా రాయాలని ఆదేశించింది. ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉండేందుకు, కాపీయింగ్‌కు వీలు లేకుండా ఉండేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఇప్పటివరకు అమలులో ఉన్న ఐదు నిమిషాల నిబంధనను తొలగించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని పేర్కొంది.