బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (14:51 IST)

ముహూర్తానికి ముందు డబ్బు నగలతో పారిపోయిన వరుడు.. ఎక్కడ?

bride
వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. తమతమ కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, వరుడు తనలోని వంకర బుద్ధిని చివరి నిమిషంలో బయటపెట్టాడు. ముహూర్తానికి కొన్ని గంటల ముందు డబ్బు, నగలతో పారిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని మారేడ్‌పల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మారేడ్‌పల్లికి చెందిన సందీప్ రమేశ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి ప్రేమ కథకు తల్లిద్రండులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరూ మేజర్లే.. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయినా తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కష్టపడి పెద్దవాళ్లను ఒప్పించారు. 
 
ఈ నెల 8న (శుక్రవారం) వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ప్రేమ వివాహమే అయినా కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.10 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లలో ఇరుకుటుంబాలు తలమునకలుగా ఉండగా... గురువారం నాడు సందీప్ రమేశ్ అందరికీ షాకిచ్చాడు. డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన పెళ్లికూతురు నివ్వెరపోయింది. ఈ ఘటనకు సంబంధించి పెళ్లికూతురు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వరుడు కోసం గాలిస్తున్నారు.