ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లిన డ్రైవర్.. గుండెపోటు.. సీటులోనే..
ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు వెళ్లిన కారు డ్రైవర్‌కు సీటులో ఉండగానే గుండెపోటు వచ్చింది. దీంతో సీటులోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బడంగ్ పేటకు చెందిన ధనుంజయ్ (41) అనే వ్యక్తి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. రోజులాగే శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన ధనుంజయ్... ట్రావెల్స్ ఆఫీసుకు చేరుకున్నాడు. పాతబస్తీ లాల్ దర్వాజ ప్ర్రాంతంలో ఓ ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి కారును తీసుకెళ్లాడు.
కారు నల్లవాగు సమీపంలోకి చేరుకున్న ఆయనకు అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పిగా అనిపించడంతో ధోబీఘాట్ వద్ద కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, కారును నియంత్రించలేక పోయాడు. దీంతో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి పైకెక్కి ఆగిపోయింది. మిగతా వాహనదారులు వచ్చి చూసేసరికి ధనుంజయ్ స్టీరింగ్‌పై తలవాల్చేసి కనిపించాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ధనుంజయ్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటువల్లే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు.