శనివారం, 5 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఏప్రియల్ 2025 (20:15 IST)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

rain water - tg assembly
గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ నగర వాసులను వరుణుడు శాంతపరిచాడు. హైదారాబాద్ నగంరలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమయత్ నగర్, కోఠి, అమీర్ పేట్, బోరబండ, జుబ్లీహిల్స్, ఎల్పీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ మెర్క్యురీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
అలాగే ఈ అకాల వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం ముందుభాగం చిన్నపాటి చెరువును తలపిస్తుంది. చార్మినార్‌లోని ఓ మీనార్‌పై నుంచి పైకప్పులు  విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. వివిధ చోట్ల రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మలక్‌పేట వంతెన వద్ద వరదనీరు నిలిచిపోతుంది. రాజ్‌భవన్‌లో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజ్‌భవన్‌ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ నిలచిపోయింది. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద భారీగా నీరు చేరింది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. స్తంభాలు ఒరిగిపోయాయి. ఖైరతాబాద్ - పంజాగుట్ట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్‌ఘాట్ వద్ద భారీ వర్షం కారణంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ఒకటి చిక్కుకునిపోయింది. 
 
మరోవైపు, ఈ అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. వేరశెనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై ఈదమ్మ (55), సైదమ్మ (35) ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు, అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ నగర వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.