Tirumala Rains: తిరుమలలో భారీ వర్షాలు.. పెరిగిన చలి తీవ్రత.. భక్తుల ఇక్కట్లు (video)
Tirumala Rains: తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న భారీ వర్షానికి తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నా.. మంచుదుప్పటిలో మునిగిన తిరుమల అందాలను ఆస్వాదిస్తున్నారు.
వర్షాలతో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోయాయి. ప్రస్తుతం అక్కడ 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. చలికితోడు వర్షాలతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీదులు జలమయమయ్యాయి. ఆలయంలో కొద్ది పాటి వరద నీరు చేరుకుంది.
స్వామి వారి దర్శనం తరువాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ గదులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. వర్షాలకు అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్డులో కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.