సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (11:31 IST)

అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఎందుకు : స్మితా సభర్వాల్ ప్రశ్న.. నెటిజన్ల విమర్శలు!!

smitha sabarwal
అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక కోటాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా ఉన్న స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఆమె చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర స్థాిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు విమర్శించారు. 
 
ఇటీవల మహారాష్ట్రకు చెందిన పూజా ఖేడ్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా నేపథ్యంలో.. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ను క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా' అని పేర్కొన్నారు.
 
ఈమె పోస్టుపై నెటిజన్లు స్పందించారు. పలువురు ముక్తకంఠంతో ఖండించారు. 'వైకల్యం అనేది శక్తి, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ పోస్టు చూస్తుంటే వైవిధ్యం, జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తోంది' అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ కరుణ అన్నారు. 'ఈ పోస్ట్ చూస్తుంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోంది' అని ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఎక్స్ పేర్కొన్నారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆమె క్షమాపణలు చెప్పాలని తెలంగాణ దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య డిమాండ్ చేశారు.