కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అభయారణ్య భూముల పరిరక్షణ కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరిపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ అభయారణ్యాన్ని ధ్వంసం చేయొద్దని, పరిక్షించాలంటూ అనేక మంది సినీ సెలెబ్రిటీలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భూముల పరిరక్షణ పోరాటంలో పాల్గొన్న హెచ్.సి.యు విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ సచివాలయంలో హెచ్.సి.యు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూపులతో మంత్రివర్గ ఉప సంఘం సభ్యులైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చర్చలు జరిపారు.
ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసు ఉపసంహరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని, కేసుల ఉపసంహరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా న్యాయశాఖ అధికారులు తగిన సూచనలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశాలు జారీచేశారు. అయితే, కంచ గచ్చిబౌలి భూముల అంశంపై మాత్రం ప్రభుత్వం ఇంకా ఓ స్పష్టత ఇవ్వలేదు.