ఎమ్మెల్సీ కవిత మామపై భూఆక్రమణ కేసు నమోదు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు చెందిన ఎమ్మెల్సీ కె.కవిత మామయ్య రామ్ కిషన్ రావుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్కేఆర్ అపార్టుమెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో కిషన్ రావుకు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు బంధువు నగేశ్ కుమార్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషనులో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్ఐ మహమ్మద్ ఆరీఫ్ వెల్లడించారు.
రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ ఆర్‌కేఆర్ అపార్టుమెంట్ వాసులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేశ్ కుమార్ చెబుతున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషనులో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తన పేరు మీద ఉన్నాయన్నారు. ఈ స్థలంతో రామ్ కిషన్ రావుకు సంబంధం లేదన్నారు. ఈ మేరకు నగేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ కిషన్ రావుతో పాటు అపార్టుమెంట్ వాసి గోపి అనే వ్యక్తితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఆర్కేఆర్ అపార్టుమెంట్ ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారంటూ అపార్టుమెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించారని, అంతు చూస్తానంటూ కిషన్ రావు అనుచరులు బెదిరించి దాడికి పాల్పడ్డారని వివరించారు. దీంతో రామ్ కిషన్ రావు, మాజీ కార్పొరేటర్ భర్త సుదామ్ రామచంద్, నగేశ్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు.