పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..
మేడ్చల్‌లో పట్టపగలే నడి రోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. అన్నయ్యను తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా శ్రీ మాచారెడ్డికి చెందిన గుగులోతు గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గన్యాకు ఉమేశ్ (24), రాకేశ్ (22), హరిణి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమారుడు ఉమేశ్‌కు వివాహం జరిపించగా భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో వేరే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు.
ఉమేశ్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను నిత్యం వేధించసాగాడు. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, భార్యపై కూడా దాడికి దిగాడు. ఆదివారం కూడా ఇదే తరహాలో గొడవలు జరిగాయి. దీంతో ఉమేష్ సోదరులు ఆగ్రహానికి గురైయ్యారు. రాజేశ్, లక్ష్మణ్ అనే ఇద్దరు సోదరులు ఉమేష్‌పై దాడి చేసేందుకు అతనిని పట్టుకునేందుకు వెంబడించారు. వారికి చిక్కకుండా ఉమేశ్ పరుగులు తీసినా.. బస్ డిపో ఎదుట పట్టుకుని ఉమేశ్‌ను కత్తులతో పొడిచి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మేడ్చల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.