శనివారం, 29 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త - రూ.1.50 కోట్లకు ప్రమాద బీమా

revanth reddy
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.25 నుంచి రూ.1.50 కోట్ల మేరకు ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఇదే విషయంపై రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో వేతన ఖాతా ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద, ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 
 
సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. వేతన ఖాతా ఉన్న ప్రతి కార్మికునికి రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా పలు బ్యాంకులు అమలుజేస్తున్నాయి. 
 
సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వేతన ఖాతా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాల్లో ముఖ్యమైనవి ఇలా.. ఎస్బీఐలో శాలరీ వేతన ఖాతా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు రూ.కోటి బీమా చెల్లిస్తోంది. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.1.60 కోట్లు, రూపే డెబిట్ కార్డు ఉంటే మరో రూ.కోటి ఇస్తోంది. శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.కోటి, సహజ మరణం అయితే రూ.10 లక్షలు అందజేస్తోంది. నెలకు రూ.2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తోంది.