మంగళవారం, 18 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (14:53 IST)

ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నిమజ్జనం : సీఎం రేవంత్ ప్రశంసలు

Grand Immersion Of Khairatabad Ganesh Idol
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పోలీసు శాఖపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పని చేశారన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 
 
మరోవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు సడలించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, అసెంబ్లీ, లక్డీకాపూల్‌ మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. 
 
మరోవైపు, నిమజ్జనంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. 40 అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు ఈసారి పెరిగాయన్నారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే బడా గణేశుడి నిమజ్జనం పూర్తయిందని చెప్పారు. 
 
శోభాయాత్రలో జరిగిన గొడవలపై 5 కేసులు నమోదు చేశామని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిమజ్జనంలో సాంకేతికతను ఉపయోగించామన్నారు. 9 డ్రోన్లు వాడినట్లు తెలిపారు. 25 హైరైజ్‌ భవనాలపై కెమెరాలు పెట్టి మానిటరింగ్‌ చేశామని సీపీ వివరించారు. సీఎం ఆకస్మిక తనిఖీ చేయడం మంచిదేనని.. దీని వల్ల ఎలాంటి సమస్య రాలేదన్నారు.