సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (18:43 IST)

విజయసాయి రెడ్డి.. ఓ నాన్ సీరియస్ పొలిటీషియన్ : సీఎం రేవంత్ రెడ్డి

revanth reddy
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఓ నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, ఆయన గురించి మాట్లాడాల్సిన పనిలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుడా, కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది గత ప్రభుత్వమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్‌ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్నారు. అందువల్ల విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఉన్నత న్యాయస్థానం చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మిషన్‌ భగీరథపైనా విచారణకు ఆదేశించామని సీఎం వెల్లడించారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తి అయిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
 
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ శాసనసభకు రావాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో ఆయన చిత్తశుద్ధిని ప్రజలు చూశారన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి రాలేదంటేనే ఆయన ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, భారాస గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ఎద్దేవా చేశారు. 
 
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్థరాత్రి పూట పోలీసులను మొహరించి ఆక్రమించుకుని, రోజుకు 12 టీఎంసీ నీరు తరలించుకుంటే అపుడు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామని సీఎం తెలిపారు.