శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

అమ్మా... ఖమ్మం నుంచి పోటీ చేయండి.. సోనియాకు టీ కాంగ్రెస్ నేతల వినతి

sonia - t cong leaders
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానం పోటీ చేయాలని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తిచేశారు. ఈ మేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సోమవారం సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ ముగ్గురు నేతల్లో సోనియా గాంధీ దాదాపు అర్థగంట పాటు సమావేశం కావడం గమనార్హం. 
 
భేటీ తర్వాత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా ఆమెను కలిసినట్టు మల్లుభట్టి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి ఒక తీర్మానం చేసిన ఆమెకు పంపించామని ఆయన గుర్తుచేశారు.
 
అదేసమయంలో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూడా ఆమెకు వివరించినట్టు చెప్పారు. ముఖ్యంగా, అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో 15 కోట్ల జీరో టిక్కెట్లు జారీ అయ్యాయని తెలిపారు. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు.