కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు.. మాజీ సీఎం కేసీఆర్‌కు జిల్లా కోర్టు నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది.
ఈ అంశంలో కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5వ తేదీన విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబరు 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న కోర్టు కొట్టివేయగా.. ఆయన ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది.
సీఎం రేవంత్ అమెరికా టూర్ : తెలంగాణాలో భారీ విస్తరణకు కాగ్నిజెంట్ సై
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆయన యూఎస్‌లో పర్యటిస్తూ, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటున్నారు. ఇందులోభాగంగా, ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ నగరంలో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ సహా తెలంగాణలో ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగ్నిజెంట్ విస్తరణ, కొత్త సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ సంస్థలు హైదరాబాద్ను తమ గమ్యస్థానాలుగా ఎంచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.
కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాదిమంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని టైర్ 2 కంపెనీలకు ఐటీ సేవలను విస్తరించాలని సీఎం సూచించారు. ఈ సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ ఉందని, ఈ నగరం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపామన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్న తమ కొత్త సెంటర్ ద్వారా తమ క్లయింట్స్‌ను మరిన్ని మెరుగైన సేవలను అందిస్తామన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ ఆధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేక దృష్టి సారించనుందని తెలిపారు.