తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రోజువారీ విడుదల చేసే వాతావరణ నివేదిక ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీవ్రమైన గాలులతో ఉరుములు, పిడుగులు పడే అవకాశం వుంది కనుక ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో ఎలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.