శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 12 నవంబరు 2018 (11:18 IST)

ఒక్క వాట్సాప్ ఫోటో అందమైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది.. ఎలా?

అందరితో బాగా కలిసిపోయే స్వభావం. అందరూ మనవాళ్ళే అనుకునే మంచితనం. ఎవరూ తన శత్రువులు కాదనుకునే అమాయకత్వం. ఇదంతా ఆ అమ్మాయి పాలిట శాపమైంది. చేయని తప్పుకు చివరకు ప్రాణాల మీదకే తెచ్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
యాదాద్రికి సమీపంలోని రాయగిరికి చెందిన గీత ఇంటర్ పూర్తి చేసి జాబ్ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఫిలింనగర్‌లోని హాస్టల్‌లో ఉండేది గీత. జాబ్ దొరక్క పోవడంతో కంప్యూటర్‌లో శిక్షణ కోసం పంజాగుట్టలోని ఒక ఇనిస్టిట్యూట్లో చేరింది. ఆ ఇనిస్టిట్యూట్ లోని విద్యార్థులకు బాగా దగ్గరైంది. కలుపుగోలుతనం ఉండటంతో గీతను అందరూ అభిమానించే వారు. అయితే గీతకు అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. అందరూ తన స్నేహితులని భావించి గీత తన గ్రామానికి చెందిన రాజుతో చనువుగా ఉండేది. సొంత బంధువులా భావించేది. తనకు శిక్షణలో ఏ అనుమానం వచ్చినా రాజుని అడిగి తెలుసుకునేది.
 
ఒకరోజు కంప్యూటర్‌లో వచ్చిన అనుమానాన్ని తెలుసుకునేందుకు రాజుతో కలిసి పార్కుకు వెళ్ళింది. అక్కడ మాట్లాడుతుండగా ఇనిస్టిట్యూట్‌కు చెందిన నరేష్‌ అనే యువకుడు వారిద్దరిని ఫోటోలు తీశాడు. తన ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన వాట్సాప్‌తో పాటు తన గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లలో ఫోటోలను షేర్ చేశాడు. నరేష్‌ కూడా గీత స్వగ్రామానికి చెందిన వాడే. 
 
వాట్సాప్‌లో ఫోటోలను చూసిన గీత ఆశ్చర్యపోయింది. ఎందుకిలా చేశావంటూ నరేష్‌‌ను ప్రశ్నించింది. అయితే ఆమెకు సమాధానం చెప్పలేదు నరేష్‌. విషయం కాస్తా గీత అన్న రాజేష్‌‌కు తెలిసి నరేష్‌‌ను మందలించాడు. మూడురోజుల పాటు సైలెంట్‌గా ఉన్న నరేష్‌ మళ్ళీ గీతకు ఫోన్ చేయడం ప్రారంభించాడు. 
 
నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి. మీ ఇద్దరు పార్క్‌లో ఉన్న ఫోటోలు పెట్టి దానికి క్యాప్షన్‌లు పెట్టి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాంలో పడేస్తానంటూ బెదిరించాడు. తనను ప్రేమిస్తే ఇదంతా చేయనని చెప్పాడు. దీంతో గీత ఆలోచనలో పడింది. నరేష్‌ వేధింపులను భరించలేక హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.