శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

త్వరలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు..

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటి గాంధీ ఆస్పత్రి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు స్తంభించిపోయాయి. గత 8 నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆస్పత్రిలో అందుబాటులో ఉండే అన్ని రకాల సేవలను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఈ నెల 21వ తేదీ నుంచి అన్నిరకాల వైద్యసేవలు ప్రారంభించనున్నది. అందుకు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి గురువారం మార్గదర్శకాలు జారీచేశారు. 
 
కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కొవిడ్‌ సేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని గాంధీ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని సూచించారు. ఇతర దవాఖాన విధులు, అన్నిశాఖల టీచింగ్‌, ఇతర దవాఖానల అకడమిక్‌ పనులు ప్రారంభించాలని తెలిపారు. కొవిడ్‌ బాధితుల లోడ్‌ ఆధారంగా కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ వార్డులకు సిబ్బంది విభజన చేయాలని సూచించారు. 
 
గాంధీ దవాఖానను కొవిడ్‌ సేవలకే పరిమితం చేయడంతో పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని, మరోవైపు జూనియర్‌ వైద్యులు అకడమిక్‌ తరగతులు నష్టపోతున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్షణం స్పందించిన మంత్రి.. గాంధీలో అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని డీఎంఈని ఆదేశించారు. 
 
ఈ మేరకు పూర్తి పరిశీలన అనంతరం కొవిడేతర సేవలు సైతం ప్రారంభించవచ్చని, అందుకు సరైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మంత్రి ఈటల అంగీకారంతో డీఎంఈ.. గాంధీలో అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.