శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (07:17 IST)

హైదరాబాద్‌ లో మరో ఉక్కు వంతెన.. మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు మరో ఉక్కు వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌ఆర్‌డీపీ కింద మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.

ఈ క్రమంలో నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 
 
రూ. 523.37కోట్ల వ్యయంతో నల్గొండ క్రాస్‌రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం జరగనుంది. ఈ కారిడార్‌ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా, ఇందులో ఫ్లై ఓవర్‌ పొడవు 2.580 కిలోమీటర్లు. ఈ ఫ్లై ఓవర్‌పై రెండువైపులా రెండేసి లేన్లలో వాహనాలు ప్రయాణం సాగించవచ్చు. దీనిని 24 నెలల్లో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
 
నీరా స్టాల్‌.. గౌడ వృత్తి అస్థిత్వానికి ప్రతీక : కేటీఆర్
నీరా స్టాల్‌.. గౌడ వృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోనే తొలి నీరాకేఫ్‌ ఏర్పాటుకు నగరంలోని నెక్లెస్‌రోడ్డులో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందన్నారు. రాష్ట్రంలో గీత వృత్తిపై ఆధారపడి 2 లక్షల మందికి జీవిస్తున్నారని తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనేది సీఎం కేసీఆర్‌ నమ్మకమని కేటీఆర్‌‌ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం రూ. 16 కోట్ల వృత్తి పన్ను బకాయిలను రద్దు చేసిందని గుర్తు చేశారు.

నీరా స్టాల్‌.. గౌడవృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని నీరా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై సీఎం కేసీఆర్‌‌ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. వేల ఏళ్ల క్రితం నుంచి కల్లు గీత వృత్తి ఉందని ఆయన గుర్తు చేశారు.

గీతవృత్తికి అనుబంధంగా ఎన్నో వృత్తుల వారు అభివృద్ధి చెందారు. కల్లుగీత వృత్తి పన్ను రద్దు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ పన్ను రద్దు కోసం ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. గత పాలకులు కల్లు దుకాణాలు మూసివేయించి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు.

కానీ తెలంగాణ ప్రభుత్వంలో కల్లుగీత వృత్తి పన్నును రద్దు చేయడంతో పాటు కల్లు దుకాణాలు తెరుచుకున్నాయని మంత్రి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికులకు ఈ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. హరితహారంలో కూడా ఈత చెట్లు నాటుతూ ఈ ప్రభుత్వం గౌడ్స్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. కులవృత్తుల వారి ఆత్మగౌరవం కాపాడేందుకు సీఎం ఎన్నో చర్యలు చేపట్టారు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. 
 
1800 చదరపు మీటర్ల స్థలంలో.. రూ. 3 కోట్లతో ఈ కేఫ్‌ను నిర్మించనున్నారు. వెయ్యి చదరపు మీటర్లలో కేఫ్‌ స్టాళ్లు, 800 చ.మీ. ఓపెన్‌స్పేస్‌లో హుస్సేన్‌ సాగర్‌ వ్యూ కనిపించేలా సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్న నీరాకేఫ్‌ మొత్తంగా చూస్తే తాటాకు ఆకృతిని పోలి ఉంటుంది.