మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 9 జులై 2020 (11:23 IST)

హైదరాబాద్‌లో 30 నిమిషాల్లో కరోనా పరీక్ష

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కొవిడ్‌-19 పరీక్షలు గ్రేటర్‌లో ప్రారంభమయ్యాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

తొలిరోజు మూడు జిల్లాల్లో ఆరేడు వందల మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో 50 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, రంగారెడ్డిలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు చేయనున్నారు.

కరోనా లక్షణాలు ఉన్నవారికి, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి ముక్కు, గొంతు స్రావాలు(స్వాబ్‌) సేకరిస్తారు. ప్రత్యేక కిట్‌ సాయంతో చేసే పరీక్షల్లో 30 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పొలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ-పీసీఆర్‌) విధానాన్నే అనుసరిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తాజాగా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

ఈ విధానంలో పాజిటివ్‌ వస్తే కరోనా పాజిటివ్‌ కేసుగానే పరిగణిస్తారు. రెండోసారి పరీక్షించాల్సిన అవసరం లేదు. ఫలితం నెగెటివ్‌ వస్తే నిర్ధారణ కోసం తిరిగి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేసి ధ్రువీకరించుకోవాలి.

ర్యాపిడ్‌ పరీక్షల ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. ఒక్కో ఆరోగ్య కేంద్రంలో 25 మందికే పరీక్షలు చేయాల్సి ఉండటంతో తొలుత లక్షణాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు.