శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (14:27 IST)

నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణం...

తన చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండలోని, నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రామరాజు నర్సంపేటలోని ఓడీసీఎంఎస్‌ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాడు. 
 
లాక్డౌన్ కారణంగా ఇటీవల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కనపెట్టారు. ఇటీవల ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి నెక్కొండకు రాగా, ఆయనను కలిసిన రామరాజు తండ్రి వెంకటేశ్వరులు తన కుమారుడికి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.
 
మంగళవారం కూడా ఎమ్మెల్యేను తన నివాసంలో కలిసి ఇదే విషయమై అభ్యర్థించాడు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని చాకుతో గొంతు కోసుకున్నాడు. 
 
ఈ సందర్భంగా తన చావుకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డే కారణమని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్‌ను అభ్యర్థిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 
 
బాధితుడు ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఎమ్మెల్యే పెద్ది.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.