1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (10:47 IST)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాయిగా జీవించాం.. ఈటల రాజేందర్ భార్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎంతో బాగున్నదని, సమైక్య రాష్ట్రంలో ఇంతటి నిర్బంధం లేదని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున వాపోయారు. ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, తమ ఇంటి చుట్టూ పోలీసులే పహారా ఉన్నారన్నారు. ఈ బందోబస్తు ఎవరిని భయపెట్టడానికి? అని ప్రశ్నించారు. 
 
'దొంగతనం చేశామా.. టెర్రరిస్టులమా... పిలిచి చెప్పొచ్చు కదా. పోలీసులు, అధికారులు.. మా ఇంటి కోసమే పని చేస్తున్నట్టుగా ఉంది. ఇంటెలిజన్స్ వాళ్లకు మా ఇట్టిదగ్గరే డ్యూటీ వేశారు. మా చుట్టాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ నంబర్ ఎంత.. ఎక్కడ ఉంటారంటూ క్వశ్చన్లు వేస్తున్నారు. పాక్ సరిహద్దులో ఉన్నామా.. తెలంగాణలో ఉన్నామా? ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. 
 
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ఇలా చేయలేదు. ఇలాంటి పరిస్థితులు ఆనాడు ఉండుంటే యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చేవారే కాదు. తెలంగాణ ప్రజలు ఒక్క అడుగు వేయకపోయేవారు. వాళ్లు మెతక వైఖరితో ఉన్నారు. న్యాయబద్దంగా.. ధర్మబద్దంగా ఉన్నారు. ఈయనకైతే ఓ న్యాయం లేదు.. ధర్మం లేదు' అంటూ నాటి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తు చేసుకున్నారు. 
 
సీఎం కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి కావాలని జమున ఎద్దేవా చేశారు. 'ఇప్పటికీ హేచరీస్ దగ్గర పోలీసులు ఉన్నారు. నిన్నమొన్న మీ దగ్గరే కదా పని చేశారు. 20 సంవత్సరాలు... మీ ప్రగతి భవన్ దగ్గర లేదంటే నియోజకవర్గం దగ్గర ఉండేవారు. ఐదు నిమిషాలు లేట్ కాగానే.. తమ్ముడూ.. ఎక్కడున్నావు అంటూ ఫోన్ చేసేవారు. నేనే కదా చాలా సార్లు ఫోన్ ఎత్తింది. అట్లాంటి తమ్ముడు నేడు దెయ్యమెలా అయ్యాడు. కులరహిత సమాజం కావాలనే ఆనాడు పెళ్లి చేసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చాక.. కులాల వారీగా విభజించించారు' అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.