1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (11:12 IST)

కాషాయం తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి ఈటల.. నేడు చేరిక?

తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆయన పూర్తిచేసుకున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈటల రాజేందర్ కాషాయం పార్టీలో చేరే విషయంపై ఓ స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదే అంశంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, బీజేపీ ముఖ్య నేతలతో సోమవారం రాత్రి సమావేశమయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 
 
బీజేపీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఒక పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ వివేక్‌ కూతురు, ఏనుగు రవీందర్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి మొయినాబాద్‌లోని వివేక్‌ ఫాంహౌ‌స్‌కు వెళ్లారు. అదే సమయంలో ఈటల రాజేందర్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. 
 
సుమారు రెండు గంటలు జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు, అధికారుల మూకుమ్మడి బదిలీలు ప్రస్తావనకు వచ్చాయి. తనపై రోజుకో కేసు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసే అంశం ప్రస్తావనకు రాగా.. ప్రస్తుతం రాజీనామా చేయకపోవడమే మంచిదని బీజేపీ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇవ్వాలని ఈటల కోరగా, కమలం నేతల నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. పార్టీలో చేరడమే సముచితమని వారు పేర్కొన్నారు. 
 
కాగా, ఈటల, ఇంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, సీనియర్‌ నేతలు జితేందర్‌రెడ్డి, ఏ.చంద్రశేఖర్‌, స్వామిగౌడ్‌లతో సమావేశమయ్యారు. పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ను కూడా సంప్రదించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. 
 
ఆయన బీజేపీలో చేరతారా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాకున్నా, ఈటల అడుగులు మాత్రం కమలం వైపే ఉన్నాయని స్పష్టమవుతోంది. అన్నీ అనుకూలిస్తే ఈటల రాజేందర్ గురువారమే కాషాయం కండువా కప్పుకునే అవకాశం ఉంది.