సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (18:07 IST)

పుల్వామా దాడిలో భర్త మృతి... లెఫ్టినెంట్‌గా భార్య బాధ్యతలు...

martyr Major Dhoundiyal's wife
జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామాలో 2019లో జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ అమరులయ్యారు. అప్పటికీ ఆయనకు వివాహం జరిగి 9 నెలలే అవుతోంది. 27 ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన భార్య నిఖిత కౌల్‌ను చూసి అందరూ బాధపడ్డారు. ఆమె మాత్రం జాలి కాదు.. గర్వపడమని చెప్పారు. అంతేకాదు భర్త మీద ప్రేమతో ఆయన బాధ్యతను పంచుకున్నారు.
 
ఢిల్లీలో ఎంఎన్‌సీ ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. తన భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలోనే సీటు సాధించి శిక్షణ తీసుకున్నారు. శనివారం లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి నైన్యంలోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఆమె తన భర్తను గుర్తుచేసుకున్నారు. తన ప్రయాణం ఇప్పుడే మొదలైందన్నారు. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని తాను కొనసాగించనున్నట్లు తెలిపారు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఐ లవ్ యూ విభూ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.