ఒక భార్య ఇద్దరు ప్రియులు, కరోనా చంపేసిందని భర్తను హత్య చేసేసింది
ఇద్దరితో అక్రమ సంబంధం. ఆ ఇద్దరినీ పిలిచి భర్తను హత్య చేసింది ఆ ఇల్లాలు. పైగా తన భర్తకు కరోనా వచ్చిందనీ, ఊపిరాడటం లేదంటే ఇంట్లో నుంచి గావుకేకలు పెట్టింది. కరోనా అనేసరికి ఇంట్లోకి ఎవ్వరూ రాలేదు. ఎవరో ఇద్దరి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఇక ఇంటికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతుండగా సమీప బంధువు ప్రత్యక్షమయ్యాడు. దాంతో అసలు నిజం బయటపడింది.
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని ఈరోడు జిల్లా కుమారపాళెంకు చెందిన శ్రీనివాసన్, ప్రభ దంపతులు. వీరికి పదేళ్ల కుమార్తె కూడా వుంది. శ్రీనివాసన్ స్థానికంగా సెలూన్ నడుపుతున్నాడు. ఐతే భర్త ఇంట్లో లేని సమయంలో సమీపంలో వున్న శరవణన్, వెల్లింగిరి అనే ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఐతే ఇటీవల లాక్ డౌన్ కావడంతో శ్రీనివాసన్ ఇంటికే పరిమితమయ్యాడు.
ఐతే లాక్ డౌన్ విధించిన దగ్గర్నుంచి తన భార్య ప్రభ నిత్యం ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ వుండటాన్ని గమనించాడు. ఎవరా అని ఆరా తీస్తే విషయం బయటపడింది. దీనితో భార్యను తీవ్రంగా మందలించాడు. భర్త వుండగా ప్రియులతో తన సంబంధం కొనసాగించడం సాధ్యం కాదని, ప్రియులిద్దర్నీ పిలిపించి భర్తను గొంతు నులిమి హత్య చేసింది. అది హత్య కాదనేందుకు కరోనా పేరుతో నాటకమాడింది. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న ఆమె ప్రియుల కోసం గాలిస్తున్నారు.