1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2015 (12:05 IST)

తెలంగాణాలో ఆగని రైతుల ఆత్మహత్యలు.. బుధవారం ఒక్కరోజే ఏడుగురి బలవన్మరణం

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకునేవారే కనిపించడం లేదు. రైతన్నల ఆదుకుంటామనీ, ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దనీ పాలకులు పదేపదే చేస్తున్న ప్రకటనలు అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపలేక పోతున్నాయి. ఫలితంగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనికి నిదర్శనం బుధవారం ఒక్కరోజే ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే. 
 
ముఖ్యంగా రైతు సమస్యలు, ఆత్మహత్యలపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆ రాష్ట్రంలోని రైతుల దుస్థితికి అద్దంపడుతోంది. చేసిన అప్పులు తీర్చే దారి తెలియకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఏడుగురు రైతుల్లో సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌కు చెందిన రైతులు ఇద్దరు ఉన్నారు. 
 
అదే జిల్లాలో మరొకరు గుండెపోటుతో చనిపోయారు. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన రైతు శంకర్, గజ్వేల్ మండలం కేంద్రానికి చెందిన రైతు పద్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణఖేడ్ మండలం గంగాపూర్‌లో ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. మెదక్ జిల్లా కుకునూరు గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకోబోయాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు భారీగా పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు.
 
నల్గొండ జిల్లా చెండూరు మండలం జోగిగూడెంలో నర్సింహ అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పెండ్లిమడుగులో అప్పులబాధ తాళలేక రైతు శ్రీనివాస్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు మధురప్ప, కరీంనగర్ జిల్లాలో రైతు పోశయ్య, ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరావు అనే రైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు.