ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Modified: శనివారం, 13 అక్టోబరు 2018 (21:07 IST)

ప్రేమికురాలికి పరువు శిక్ష... గుండు గీసి, నాలుకపై వాత...

యువతులపై దారుణాలు ఆగడంలేదు. తాజాగా ఓ యువతి తన కులం కాని ఓ యువకుడిని ఇష్టపడిందని, పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిందని ఆ ఊరి గ్రామ పెద్దలు ఆమెకు పరువు శిక్ష విధించారు. ఆమె నాలుకపై బంగారు కడ్డీతో వాతలు పెట్టి, గుండు కొట్టించాలని తీర్మానించారు.
 
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీంరెడ్డి గూడెం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి రేచపల్లికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. ఐతే వీరిరువురి కులాలు వేరు. దీనితో ఆరు నెలల క్రితం యువతి తల్లిదండ్రులు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ గొడవల మధ్య తమ కుమార్తె తమ ఊరిలో ఎందుకు అనుకుని ఆమెను తమ దూరపు బంధువుల ఇంట్లో వుంచారు. 
 
ఐతే గొడవ కాస్త సద్దుమణిగిందని యువతిని సొంత ఊరికి తీసుకుని వస్తుండగా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. కులం కాని కులానికి చెందిన యువకుడిని ప్రేమించిన మీ కుమార్తె గ్రామంలో వుండటానికి వీల్లేదనీ, ఒకవేళ గ్రామంలో వుండాలంటే తాము విధించే శిక్షను అనుభవించాలని షరతు పెట్టారు. ఇందులో భాగంగా.. రూ.26 వేల జరిమానాతో పాటు ఆమె నాలుకపై బంగారు తీగతో వాత పెట్టాలని, మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా గుండు గీసి గ్రామంలో ఊరేగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం తీర్పును అమలు చేయాలని సూచించగా సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి యువతిని రక్షించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.