శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (15:55 IST)

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. బిర్యానీ ఘుమఘుమలు.. సేల్స్ అదుర్స్

హైదరాబాద్ ఫుడ్ మెనూలో బిర్యానీ వుంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ వంటకం. హైదరాబాద్‌లో బిర్యానీ దొరకని ప్రాంతమే ఉండదు. అందుకే చిన్న చిన్న రెస్టారెంట్లతో పాటు బడా బడా స్టార్ హోటల్స్‌లోనూ బిర్యానీ ఘుమఘుమలు కనిపిస్తుంటాయి. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా నగరంలోని చాలా హోటల్స్ బిజినెస్ లేక డల్ అయిపోగా... తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు మళ్లీ బిర్యానీ బిజినెస్‌కు కొత్త బూస్ట్ ఇచ్చాయి. 
 
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌కు ఇతర జిల్లాల నుంచి కూడా పలు పార్టీల నాయకులు వచ్చారు. అన్ని పార్టీలకు చెందిన వాళ్లు దాదాపు వేల మంది ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో హోటళ్లలో బస చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. 
 
మార్చి నుంచి ఆగస్టు వరకు హైదరాబాద్‌లోని దాదాపు సగానికిపైగా రెస్టారెంట్లు మూతబడగా.. ఈ నెలలో పరిస్థితి బాగా మెరుగైంది.  తాజాగా ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలకు, మద్దతుదారులకు నాయకులు బిర్యానీ వంటకమే ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు.
 
చాలామంది డబ్బుతో పాటు బిర్యానీ కూడా వస్తుందన్న ఆశతోనే ప్రచారంలో పాల్గొంటారు. దీంతో బిర్యానీ హోటళ్లకు ఆర్డర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బల్క్‌గా ఇస్తున్న ఫుడ్‌ ఆర్డర్లతో పాటు హోమ్‌ డెలివరీలు సైతం భారీగా ఊపందుకున్నాయి. 
 
కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గడంతో హోటళ్లకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. లాక్ డౌన్‌తో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక ఇబ్బందులు పడ్డ హోటళ్ల యజమానులు ఇప్పుడు మళ్లీ బిజినెస్‌తో బిజీ అవుతున్నారు.