గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (11:45 IST)

బల్దియా పోరుకు మోగిన నగారా... డిసెంబరు 6న పోలింగ్

గ్రేటర్ హైదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇందుకోసం ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల ఘట్టంలో భాగంగా డిసెంబరు ఆరో తేదీన పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరికీ సెలవు ఉంటుందని భావించి డిసెంబరు 6ను పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది బుధవారం నుంచి అమల్లోవుండనుంది. 
 
కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుందన్నారు. ఈ నెల 21న వాటి పరిశీలన జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 తుది గడువు అని చెప్పారు. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు.
 
జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ‌ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 
 
2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 52.09 శాతం పురుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000  మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు.
 
మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా, జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. అందుకే డిసెంబరు ఆరును పోలింగ్ తేదీగా ఖరారు చేశారు.