గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (14:19 IST)

కంగనా రనౌత్‌ను పగబట్టిన జావేద్ అక్తర్!

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు బాలీవుడ్ సీనియర్ గేయరచయిత జావేద్ అక్తర్ తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పగటిపూటే చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జావేద్ అక్తర్ ఆమెపై పరువు నష్టందావా వేశారు. 
 
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వ్యవహారంలో తనను ఇరికిస్తూ కంగన తనపై నిరాధార ఆరోపణలు చేసిందని ఆరోపించిన జావేద్... అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పైగా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
 
కాగా, హీరో హృతిక్ రోషన్ కుటుంబంతో కుమ్మక్కై జావేద్ అక్తర్ తనను ఇంటికి పిలిచి బెదిరించారని, హృతిక్ కుటుంబానికి క్షమాపణ చెప్పకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారని కొద్ది రోజుల క్రితం కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
 
సినీ పరిశ్రమలో రాకేష్ రోషన్ పెద్ద మనిషని, అతనితో పెట్టుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని జావేద్ హెచ్చరించినట్టు కంగనా తెలిపింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కంగనపై జావేద్ తాజాగా కోర్టుకెక్కారు. దీనిపై విచారణను డిసెంబరు మూడో తేదీకి కోర్టు వాయిదావేసింది. 
 
ఇదిలా ఉండగా, ముంబైలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై కంగన, ఆమె సోదరి రంగోలికి ముంబైలోని బాంద్రా పోలీసులు సమన్లు జారీచేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. మొత్తంమీద... కంగనా రనౌత్‌తో అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు ముంబై పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.