మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (12:26 IST)

ఎగువ నుంచి వరద పోటు.. గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

godavari floods
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటు ఒక్కసారిగా వచ్చి పడింది. దీంతో గోదావరి నది వద్ద నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 
 
ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
 
ఇదిలావుంటే, గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 43.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. అర్థరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరింది. బుధవారం గోదావరికి వరద మరింత పెరిగే అవాకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.
 
గోదావరికి వరద మరోసారి పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ కోరారు. అలాగే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.