తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని తెలిపింది. 24 గంటల్లో ఇది వాయిగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ. కొద్ది గంటల్లోనే కుంభవృష్టిలా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.