విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఒక అమ్మగా వచ్చా : తెలంగాణ గవర్నర్
విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు బాసర ఐఐటీకి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం బాసర విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సమస్యలను పరిష్కారిస్తామని తొలుత హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత వాటిని విస్మరించారు. దీంతో విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ అక్కడ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో తొలుత సరస్వతీ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం కుంకుమ పూజ, మహాహారతి నిర్వహించారు. అమ్మవారి చరిత్రను వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. ఆలయం తరపున ఈవో సోమయ్య గవర్నర్‌ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానని చెప్పారు. ట్రిపుల్ఐటీలోని సమస్యలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ వెల్లడించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలోకి మీడియాకు పోలీసులు అనుమతించలేదు. గట్టి పోలీసు భద్రతను కల్పించారు.