శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 జూన్ 2019 (21:32 IST)

మాంసం ముక్క తింటేనే కాపురం చేస్తా.. ఆశ్చర్యపోతున్న హైదరాబాద్ పోలీసులు

మాంసాహారం తింటావా? లేదా? ముక్క తింటే తప్ప నీతో కాపురం చేయను అంటూ భర్తతో భార్య పేచీ పెట్టుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అంతేనా.. ఈ ముక్క పంచాయితీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా చేరింది. నాకు నాన్‌వెజ్ తినడం ఇష్టం ఉండదు. నేను తినలేను అని భర్త వేడుకున్నా ఆమె పట్టించుకోలేదు. 
 
వివరాల్లోకి వెళితే...  హైదరాబాద్ రెహ్మత్‌నగర్‌కు చెందిన యువతిని సైదాబాద్‌కు చెందిన యువకుడు ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒకే సామాజికవర్గానికి చెందని వారు అయినప్పటకీ భర్త కుటుంబీకులు పూర్తి శాఖాహారులు. తమ ఇంట్లో నాన్‌విజ్ వండరని, నాకు కూడా మాంసం తినడం ఇష్టం ఉండదని ఒకవేళ నీకు తినాలనిపిస్తే బయటకెళ్లి తినాలని, లేదంటే ఇంటికి తెచ్చుకుని తినాలని భర్త పెళ్లికి ముందే భార్యతో చెప్పాడు. ఆమె కూడా సరేనంది. 
 
భార్యకు ఎప్పుడైనా తినాలనిపిస్తే రెస్టారెంట్‌కు వెళ్లి భర్త వెజ్‌ తింటే భార్య నాన్‌వెజ్ తింటూ ఉండేది. ఇలా కొంతకాలం సజవుగా సాగిన ఆ కుటుంబంలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంట్లో మటన్ వండి తీరాలని ఆమె పట్టుబట్టింది. దీనికి ఆ భర్త కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోలేదు. తాజాగా ఇప్పుడు భర్తను మటన్ ముక్క తినాలని ఒత్తిడి చేసింది. అతడు ఒప్పుకోలేదు దీంతో అలిగి, తన మాట వినని భర్తతో కాపురం చేయలేను అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
పైగా తనను భర్త మానసికంగా వేధిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణం మాంసం ముక్క అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఆహారపు అలవాట్లు విషయంలో నెలకొన్న అభిప్రాయలు మూలంగా దంపతులు విడిపోవడం ఏమిటంటూ పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలనూ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.