1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

బైకు ఢీకొన్ని పూర్తిగా కాలిపోయిన బస్సు... బైకర్ సజీవదహనం

busfire
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులతో వెళుతున్న బస్సును మంగళవారం ఉదయం ఓ బైకర్ ఢీకొన్నాడు. దీంతో బైకు పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎసిగిపడ్డాయి. ఈ మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ సజీవదహనమయ్యాడు. అయితే, మంటలు ఒక్కసారిగా చెలరేగగానే బస్సులోని ప్రయాణికులంతా ప్రాణభయంతో క్షేమంగా బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై బస్సులోని ప్రయాణికులు స్పందిస్తూ, యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళుతున్నాడు. కొల్తూరు వద్ద బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టింది. దీంతో బైకుతో సహా సంపత్ కిందపడ్డాడు. అదేసమయంలో బైకు పెట్రోల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో బస్సు, బైకు రెండూ కాలిపోయాయి. ఈ మంటల్లో చిక్కుకున్న బైకర్ సంపత్ సజీవదహనమయ్యాడు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు.