గంజాయి మత్తులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ముగ్గురు కామాంధులు ఓ దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భాగ్యనగరిలోని లాల్ బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు.
అక్కడ తమ సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్‌షుఖ్ నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ప్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు.
అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే, కామాంధులు వేధింపులు భరించలేక ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.