బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

పోయిన చోటే సంపాదించాలని : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.2 కోట్లు స్వాహా!

హైదరాబాద్ నగరం కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.20 కోట్ల మేరకు స్వాహా చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సైబర్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేసింది. 
 
హైదరాబాద్‌ అబిడ్స్‌కు చెందిన ఓ మహిళకు సుమిత్‌ వర్మ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. తాను ట్రేడింగ్‌లో భారీ లాభాలు అర్జించి పెడుతామంటూ నమ్మించాడు. ఆ తర్వాత సుమిత్‌ వర్మతో పాటు మరో ఆరుగురు ఒక గ్యాంగ్‌గా అవతరించారు. సుమిత్‌ వర్మ గతంలో షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి గుర్తుతెలియని వ్యక్తులు ఇతడికి రూ.40 లక్షల వరకు మోసం చేశారు. 
 
పోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడం కోసం సుమిత్‌ వర్మ మోసగాడిగా అవతారమెత్తాడు. దీంతో ముంబై స్టాక్‌ మార్కెట్‌లో తాము ట్రేడింగ్‌ చేస్తున్నామని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలిస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేస్తున్నారు. సుమిత్‌ అతని మేనల్లుడైన ఫతేరి, అజిత్‌తో పాటు రాహుల్‌, మహేశ్‌దేవ్‌ మరికొంత మందితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఒక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 
 
టెలీకాలర్స్‌తో అమాయకులకు ఫోన్లు చేయిస్తూ వల వేస్తుంటారు. ముందుగా ఫేస్‌బుక్‌లో వివిధ ఐడీలతో ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టండంటూ ఫోన్‌ నంబర్‌ను, ఒక వెబ్‌సైట్‌ అడ్రస్‌ను కూడా ఇస్తున్నారు. ట్రేడ్‌ 24 పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందరిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో సాక్షి మెహత ఐడీతో వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేసిన అబిడ్స్‌కు చెందిన మహిళ, తాను ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడుతానంటూ ముందుకు రావడంతో ఆమె వద్ద నుంచి భారీగా వసూలు చేశారు. ఈ ముఠా నాయకుడు సుమిత్‌, అజిత్‌లను చత్తీస్‌ఘడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
హైదరాబాద్‌కు చెందిన మహిళ వద్ద, సుమిత్‌ అరెస్ట్‌ అయిన తర్వాత కూడా డబ్బులు లాగేశారు. కాగా తాగా కస్టడీలో ఉన్న రాహుల్‌, మహేశ్‌దేవ్‌, వారి కుటుంబ సభ్యుల ఖాతాలలో రూ.48 లక్షలు హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు డిపాజిట్‌ చేసింది. మరిన్ని డబ్బులు ఎవరి ఖాతాలో డిపాజిట్‌ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే కేసులో మరోముగ్గురు నిందితులను నోయిడాలో ఇన్‌స్పెక్టర్‌ హరిభూషన్‌ బృందం అదుపులోకి తీసుకొని, హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.