ప్రియుడిని సర్‌ప్రైజ్ చేద్దామని ప్రియురాలికి షాకిచ్చిన కేటుగాళ్లు... రూ.2 లక్షలు స్వాహా!
పుట్టినరోజు సందర్భంగా తన ప్రియుడిని సర్‌ప్రైజ్ చేద్దామని భావించిన ప్రియురాలికి ఆన్‌లైన్ కేటుగాళ్లు తేరుకోలేని షాకిచ్చారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 2 లక్షలను కాజేశారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతను పుట్టిన రోజున ఖరీదైన బ్రాండ్ మద్యం బాటిల్‌ను బర్త్‌డే గిఫ్టుగా ఇవ్వాలని భావించింది. ఇందుకోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా, అందులో కనిపించిన ఓ నెంబరుకు ఫోన్ చేసింది.
ఆ తర్వాత రంగంలోకి దిగిన ఆన్‌లైన్ కేటుగాళ్లు.. తాము కుల్దీప్ వైన్స్ నిర్వాహకులమని, ఆన్‌లైన్ ద్వారా నగరంలో ఎక్కడైనా మద్యం డోర్ డెలివరీ చేస్తామని ఆ యువతిని నమ్మించారు. అయితే, ముందుగా రూ.10 వేలు గూగుల్‌పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పి ఓ నంబరు ఇచ్చాడు. ఆ ఆగంతుకుడు చెప్చిన మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువతి.. అగంతకుడు ఇచ్చిన నంబరుకు రూ.10 వేలు బదిలీ చేసింది.
అయితే, తమ బ్యాంకు ఖాతాలో డబ్బు జమకాలేదని, తాము పంపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని అతడు చెప్పడంతో అలాగే చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆమె ఖాతా నుంచి మరో రూ.30 వేలు డెబిట్ అయ్యాయి.
మరోసారి కాల్ చేసిన ఆగంతుకుడు తమకు ఎక్కువగా డబ్బులు వచ్చాయని, బాటిల్ ఖరీదు పోను మిగతా డబ్బు రిటర్న్ చేస్తామని బురిడీ కొట్టించి ఇంకో క్యూఆర్ కోడ్ పంపించాడు. అలా పలు దఫాలుగా రూ.1.20 లక్షలు కాజేశారు. ఆమెను నమ్మించేందుకు కేటుగాడు రూ.200 బాధితురాలి అకౌంట్‌లో జమచేశాడు.
చివరిసారిగా, ఈ సారి క్రెడిట్‌కార్డు వివరాలు, సీవీవీ నంబర్, ఓటీపీ చెబితే డబ్బు మొత్తం ట్రాన్స్‌ఫర్ చేస్తామని అతడు నమ్మించడంతో యువతి ఆ వివరాలు చెప్పింది. మరోసారి ఆమె క్రెడిట్ కార్డు నుచి రూ.70 వేలు డెబిట్ అయ్యాయి. దీంతో తేరుకున్న ఆ యువతి.. సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.