శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (18:40 IST)

దుబ్బాక ఉప ఎన్నిక.. ఓట్ల కోసం సరికొత్త ఎత్తుగడలు.. ముగిసిన ప్రచార పర్వం

Dubbaka
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. ఈ నెల 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. 10న ఫలితాలు వెల్లడిస్తారు. దుబ్బాక నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఇక ప్రలోభ పర్వానికి తెరతీస్తున్నారు. అభ్యర్థులు ఓట్ల కొనుగోలు కోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. 
 
చివరిరోజు దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నెల రోజుల ముందు నుంచే ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు. సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాతను ఆ పార్టీ రంగంలోకి దించింది. 
 
ఇక ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీష్‌రావు నోటిఫికేషన్‌ రాకముందే ఊరూరా సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. దుబ్బాక బాధ్యతను తానే తీసుకుంటానని ప్రతీచోట హామీ ఇచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే బాటపట్టారు.
 
మరోవైపు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నోటిఫికేషన్‌ రాకముందే గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీలు, అర్వింద్‌, సోయం బాపురావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీమంత్రి డీకే అరుణ తమదైన శైలిలో ప్రచారం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం దుబ్బాకలో పర్యటించారు.