గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (15:15 IST)

తెలంగాణ : దుబ్బాక ఉప ఎన్నిక తేదీ ఖరారు!

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. తెరాసకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. సిద్ధిపేట జిల్లాలో ఈ స్థానం ఉంది. 
 
తాజాగా, ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 9న ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబరు 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబరు 19ని నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీగా ప్రకటించారు. 
 
ఇక, ఈ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ నవంబరు 3వ తేదీన నిర్వహిస్తారు. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన తెరాస, బీజేపీ, కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం షురూ చేశాయి. అయితే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, మంగళవారం నుంచి దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ అమలు కానుంది.