సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (20:03 IST)

దూసుకెళ్తున్న జియో.. తెలుగు రాష్ట్రాల్లో 3.1 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో దూసుకుపోతోంది. తద్వారా జియోకు చేరే కస్టమర్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రతి నెలా లక్షలాది కొత్త సబ్‌స్క్రైబర్స్‌తో రికార్డు సృష్టిస్తోంది జియో.

ట్రాయ్ డేటా ప్రకారం.. జూన్ నెలలో ఏపీ, తెలంగాణలో కొత్తగా 1.46 లక్షల మంది కొత్తగా రిలయన్స్ జియోకు చందాదారులుగా చేరారు. ఏపీ టెలికాం సర్కిల్‌లో కొత్తగా 1,46,444 మందికి జియో చేరువైంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియోకు 3.1 కోట్ల మంది చందాదారులు ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది. 
 
జూన్‌లో ఇతర టెలికాం ఆపరేటర్లు గణనీయంగా చందాదారులను కొల్పోయాయని ట్రాయ్ వెల్లడించింది. వొడాఫోన్ ఐడియాకు 3 లక్షలకు పైగా మంది, ఎయిర్‌టెల్‌కు 68,141 మంది, బీఎస్ఎన్‌ఎల్‌కు 31,954 మంది సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై చెప్పారు. 
 
ఇక దేశవ్యాప్తంగా చూస్తే.. జూన్ నెలలో 45 మంది చందాదారులు జియోకు కనెక్ట్ అయ్యారు. తద్వారా జియో మొత్తం చందాదారుల సంఖ్య 39.72 కోట్లకు చేరింది. ట్రాయ్ డేటా ప్రకారం.. ప్రస్తుతం రిలయన్స్ జియోకే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మొత్తం టెలికాం మార్కెట్లో జియోకు 34.8 శాతం, ఎయిర్‌టెల్‌కు 27.8 శాతం, వొడాఫోన్‌ ఐడియా 26.8శాతం చందాదారులు ఉన్నారు. 
 
మరోవైపు వొడాఫోన్ ఐడియా వరుసగా 8 నెలలోనూ తమ చందాదారులను భారీగా కోల్పోయింది. జూన్‌లో 48 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వొడాఫోన్ ఐడియాకు గుడ్‌బై చెప్పారు. బీఎస్ఎన్ఎల్ నుంచి 17 లక్షలు, ఎయిర్‌టెల్ నుంచి 11 లక్షల వినియోగదారులు జూన్‌లో వెళ్లిపోయారు.