బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (07:20 IST)

ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా?: మంత్రి తలసాని

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

సికింద్రాబాద్ లోని ఆడిటోరియంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందని, సమయాన్ని వృధా చేయకుండా ప్రతి కాలనీ, బస్తీ, అపార్ట్మెంట్ లలో పర్యటించి గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందని వారు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. మిగిలిన వారికి కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందజేస్తుందని, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఇప్పటికే ప్రకటించారని ఆయన వివరించారు.

కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను భారీ వర్షాలు మరిన్ని ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. కష్టాలలో ఉన్న ప్రజలకు చేయూతను అందించేందుకు ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారని అన్నారు.

ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయలను వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు అందజేసినట్లు చెప్పారు. ప్రకృతి వైపరిత్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సాయం అందించలేదని అన్నారు.

అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక చర్యలు చేపడితే స్థానిక బిజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు.

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు 1000 కోట్లు, వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు 500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిల్లీ నుండి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తీసుకురాలేని బిజేపీ  పార్టీకి చెందిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాము అంతకంటే ఎక్కువగా తిట్టగలమని హితవు పలికారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న రోజులలో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

కేంద్రప్రభుత్వ చర్యలు దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కండ్లు ఉన్న కబోదులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

40 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం మేలు చేశారో స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకులను మంత్రి సవాల్ చేశారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలకు ఎంతో గౌరవం ఉందని, కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తుందని అన్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన  సనత్ నగర్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో  గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఈ నెల 6వ తేదీ వరకు ఈ అవకాశం ఉందని తెలిపారు.

నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పట్టుదలతో పనిచేసి మీ మీ ప్రాంతాలలో ఉన్న గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి లో ఎంతో ముందున్న సనత్ నగర్ నియోజకవర్గాన్ని గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు లో కూడా అంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

ఓటరు నమోదు కార్యక్రమంతో ప్రజలలోకి వెళ్లేందుకు కార్పొరేటర్లు, నాయకులకు మంచి అవకాశం అని పేర్కొన్నారు. గతంలో గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకున్న వారు కూడా నమోదు చేసుకోవాలని అన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ మీ మీ ప్రాంతాలలో ఉన్న గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేయడం మన బాధ్యతగా పని చేయాలని అన్నారు. కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు.