1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (09:26 IST)

జల దోపిడీలో జగన్ హస్తం మాత్రం ఉంది: రేవంత్ రెడ్డి

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్ర ప్రభుత్వ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ... కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణమని అన్నారు. నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని... కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయని రేవంత్ దుయ్యబట్టారు.

కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని అన్నారు. కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని... కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిపించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.

ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు. నదీ జలాల విషయంలో లేనిపోని వివాదాలను సృష్టించి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు.